అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాసం
నోటీసిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
రైతుకు మద్దతు ధర దక్కట్లేదు..
పొగాకు, పత్తి కొనే నాథుడే లేడు
కుక్కలు కరిచి మనుషులు మరణిస్తున్నా సీఎం నోరు మెదపట్లేదు
ఆందోళనలు చేసినా స్పందించట్లేదు..
మా ఏకైక ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాం
అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కాలేదు.. స్పీకర్ సభను వెంటనే సమావేశపరచవచ్చు
ఎన్నికలతో సహా దేనికైనా మేం సిద్ధం
తీర్మానించిన టీడీపీ... ఏకవాక్య నోటీసు
వెంటనే సభను సమావేశపరచాలని అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ వినతి
మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్, లెఫ్ట్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు
2014 వరకు ఎన్నికలు రావంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమా
దొంగ అవిశ్వాసాలొద్దు.. పడగొడతామంటే మద్దతిస్తాం: టీఆర్‌ఎస్
ఈ సర్కారుకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు: బీజేపీ
రైతు సమస్యలపై చిత్తశుద్ధితో పెడితే తప్పక మద్దతిస్తాం: సీపీఐ
ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయం: సీపీఎం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలి: వైఎస్సార్ కాంగ్రెస్
రాజకీయం రసకందాయంలో పడింది. కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెడుతున్నట్లుప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం హడావుడిగా ప్రకటించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే తాము అవిశ్వాసం పెడుతున్నామని ఆయన అన్నారు. ఆ మేరకు స్పీకర్ కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నోటీసు ఇచ్చారు. టీడీపీ చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితే తాము తప్పక మద్దతిస్తామని టీఆర్‌ఎస్, లెఫ్ట్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు స్పష్టంచేశాయి. కాగా 2014 వరకు ఎన్నికలు రావని, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎస్. రాజా సదారాంకు టీడీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాసం నోటీసిచ్చారు. గురువారం స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. సదారాంకు నోటీసు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే అవిశ్వాసం పెడుతున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెల్లడించారు. గురువారం ఆయన ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు రమేష్ రాథోడ్, పి. చంద్రశేఖర్, వర్ల రామయ్య, ఎం. అరవింద్ కుమార్‌గౌడ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కాలేదని, స్పీకర్ అనుకుంటే సభను వెంటనే సమావేశపరచవచ్చని అన్నారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి గిట్టుబాటు ధర రూ. 1,030 దక్కట్లేదని, వ్యాపార పంటలైన పొగాకు, పత్తి కొనే నాథుడే లేడని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలు కూడా ధాన్యం కొనుగోలులో విఫలమయ్యాయని, రైతుల బాధలను అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మరోపక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతులు భయపడుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావట్లేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నామన్నారు. ఆందోళనలు చే సినా ప్రభుత్వం పట్టించుకోనందున తమ వద్ద ఉన్న ఏకైక ఆయుధాన్ని ప్రయోగించాల్సి వస్తోందన్నారు.
ప్రభుత్వం పడిపోతుందా లేదా అన్నదికాదు..
అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోతుందా లేదా అనే అంశంపై తాను మాట్లాడటం లేదని, అడ్డదారుల్లో అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష లేదని, ప్రజలు కోరుకుంటే వస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజలు తమను కావాలనుకుంటే గెలిపిస్తారన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా లేదా అన్నది ఆయా పార్టీల విధానాలను బట్టి ఉంటుందన్నారు. పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతోందని, ఎంఐఎం ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ప్రకటించిందని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరగకూడదని, వారు మనస్సాక్షిగా ఓటు వేసే అవకాశం ఉండాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురిపై అనర్హతపై నిర్ణయం తీసుకోకపోయినా వారు విప్ ప్రకారం ఓటు వేయాలని, లేనిపక్షంలో వారు అనర్హులు అయ్యే అవకాశం ఉందన్నారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోతే ఎన్నికలతో సహా దేనికైనా సిద్ధమేనన్నారు.
ఇదేం ప్రభుత్వం?: ఇదేం ప్రభుత్వం, కుక్కలు కరిచి మనుషులు మరణిస్తున్నా సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన ఎందుకు ఉన్నట్లు? అని బాబు ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో కుక్కకాటుకు మందులున్నాయని మంత్రి చెప్తున్నారని, ఈ అసమర్థ, చే తకాని ప్రభుత్వంలో నిజంగా మందులుంటే ప్రజలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. కుక్క కాటు వల్ల భార్యా, భర్తలు కలిసుండే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు.
స్పీక ర్‌కు పోటీ పెట్టకూడదా?: శాసనసభ స్పీకర్ పదవికి పార్టీ అభ్యర్థిని బరిలోకి దించుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా ‘పెట్టకూడదా?’ అని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అన్నీ ఉంటాయని, తమకు ఎవరి మద్దతూ అక్కర్లేదని, ఎవరి పార్టీ విధానాలు వారికి ఉంటాయని అన్నారు. స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీ పెడితే ఎలా ఉంటుందని తమ పార్టీ నేతల నుంచి సలహా వచ్చిందని, వాటిని పరిశీలించి, చర్చించి ప్రజలకు, తమకు ఏది బాగుంటుందో అది చేస్తామన్నారు.
తెలంగాణపై నిర్ణయం చెప్పమనండి: అభివృద్ధిలో వెనక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగుజాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని బాబు అన్నారు. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అంగీకరిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘మీ అందరికీ ఓకేనా? ’ అని విలేకరులకు ఎదురు ప్రశ్నవేస్తూ ‘‘ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తారా అంటే... ఎపుడైనా జరుగుతుందా అది? ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చిదంబరం చెప్పారు కదా తీసుకొమ్మనండి’’ అని అన్నారు. పులివెందుల లో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటును బట్టి అక్కడి ప్రజలపై వైఎస్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్లధనం వెలికితీయాలని కోరుతూ బాబా రామ్‌దేవ్ చేపట్టిన నిరవధిక దీక్షకు పార్టీపరంగా మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
‘‘శాసనసభ నిబంధన 75(1) ప్రకారం ఈ సభ రాష్ట్ర మంత్రి మండలిపై అవిశ్వాసం ప్రకటిస్తోంది’’ అని అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ ఏకవాక్య నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా మరో 11 మంది సభ్యులు సంతకాలు చేశారు.
అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలి: టీడీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి ఎస్. రాజా సదారాంకు నోటీసు అందజేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొత్తకోట దయాకరరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, నక్కా ఆనందబాబు తదితరులు విలేకరులతో మాట్లాడారు. ‘అన్ని విషయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలయింది.
పభుత్వాన్ని దించాలనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించాం’ అని చెప్పారు. వెంటనే శాసనసభను సమావేశపరచాలని కోరామన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఏడేళ్ల కాంగ్రెస్ పాలనలో.. ముఖ్యంగా రెండేళ్లుగా రాష్ట్ర రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా పోయిందని ఆరోపించారు.
ఇటీవల అకాల వర్షాలు కురిసిన సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయిందని, సంక్షేమ పథకాలను అమలుపర్చటంలో విఫలమైందని ఆరోపించారు. అవిశ్వాసం పెట్టేందుకు వీలుగా సభా సమావేశాలు పెట్టాలని, సమావేశాల సమయం పొడిగించైనా చర్చను చేపట్టాలని కోరారు. తాము పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటామని చెప్పారు. శాసనసభా సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో.. రాదో వేచి చూద్దామని విలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు.